న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాల సంఖ్యను పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనను ప్రధాని మోడీ గురువారం ప్రారంభించారు. సబ్సిడీ ధరలకు ఔషదాలను విక్రయించే జన ఔషధి కేంద్రాల సంఖ్యను పదివేల నుండి 24 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ‘ లబ్థిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ మాట్లాడారు. పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్థిదారులందరికీ సకాలంలో అందేలా చూడటం ద్వారా ప్రభుత్వ పథకాల సఫలమయ్యేలా చూడటమే లక్ష్యంగా ఈ వికసిత్ భారత సంకల్ప్ యాత్రను చేపట్టినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా దియోఘర్‌లోని ఎయిమ్స్‌లో 10,000 మైలు రాయి జన్ ఔషధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. అలాగే ‘ డ్రోన్ దీదీ యోజన’ ని కూడా ప్రారంభించారు. వ్యవసాయ ప్రయోజనం కోసం రైతులకు అద్దె సేవలను అందించడానికి 2024-25 నుండి 2025-26 మధ్య కాలంలో ఎంపిక చేసిన 15,000 డ్వాక్రా బృందాలకు డ్రోన్‌లు అందించడం డ్రోన్ దీదీ యోజన లక్ష్యమని పేర్కొంది.