2021లో 7.25 లక్షలకు చేరిన సంఖ్యవాషింగ్టన్ : అమెరికాలో మన దేశానికి చెందిన 7.25 లక్షల మంది అక్రమంగా నివసిస్తున్నారు. ప్యూ రిసెర్చ్ కేంద్రం తాజా అంచనాల ప్రకారం మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత భారత్ నుండే అధిక సంఖ్యలో వచ్చిన వలసవాదులు అమెరికాలో అక్రమంగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 2021 నాటికి అమెరికాలో ఎలాంటి అను మతులు లేకుండా 10.5 మిలియన్ల మంది వలసవాదులు నివసించారు. అమెరికా జనాభాలో వీరు 3%గా ఉన్నారు. విదేశాల్లో జన్మించిన వారిలో 22% మంది వివిధ కారణాలతో అమెరికాలోనే ఉంటున్నారు. 2007-2021 మధ్యకాలంలో ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుండి అమెరికాకు వలస వచ్చిన వారి సంఖ్య పెరిగింది. వారిలో చాలా మంది గడువు తీరిన తర్వాత కూడా ఇక్కడే అక్రమంగా ఉండిపోయారు. సెంట్రల్ అమెరికా నుండి 2.4 లక్షల మంది, దక్షిణ, తూర్పు ఆసియా నుండి 1.8 లక్షల మంది అమెరికా వచ్చి చట్టవిరుద్ధంగా నివసించారు. 2021 నాటికి మెక్సికో నుండి వలస వచ్చిన 4.1 మిలియన్ల మందిది కూడా ఇదే దారి. ఎల్ సాల్వడార్ నుండి ఎనిమిది లక్షల మంది, భారత్ నుండి 7.25 లక్షల మంది అమెరికాకు వచ్చి అక్రమంగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు.2017-21 మధ్యకాలంలో భారత్, బ్రెజిల్, కెనడా, సోవియట్ యూనియన్ పూర్వ దేశాలకు చెందిన వారు అధిక సంఖ్యలో అమెరికాకు వచ్చి చట్టవిరుద్ధంగా నివసించారు. వలసవాదులు కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, న్యూజెర్సీ, ఇల్లినాయిస్ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో అక్రమంగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గ్వాటెమాలా, హోండురస్ నుండి కూడా అక్రమ వలసదారుల సంఖ్య గణనీయంగానే ఉంది. అమెరికా సమీపంలో ఉన్న సెంట్రల్ అమెరికా, కరేబియన్ ప్రాంతం, దక్షిణ అమెరికా, ఆసియా, యూరప్, సబ్-సహారా ఆఫ్రికా నుండి కూడా అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. కాగా చట్టబద్ధంగా వలస వచ్చే వారి సంఖ్య కూడా 80 లక్షలకు (29%) పైగా పెరిగింది.