చలికాలంలో పిల్లలకు జలుబు చేసిందంటే ఒకపట్టాన వదలదు. పైగా ముక్కు రంధ్రాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కొన్ని ఇంటి చిట్కాలను వాడటం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. అవేంటో చూద్దాం.
- గిన్నెలో కొద్దిగా వేడినీరు తీసుకోండి. అందులో చిటికెడు పసుపు, నీలగిరి తైలం వేసి ఆవిరి పట్టించాలి. అయితే నీరు మరీ వేడిగా ఉండకూడదు.
- దగ్గు, జలుబులతో పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే వారికి విశ్రాంతి కావాలి. ఎక్కువసేపు నిద్ర పోనీయాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. రోజు కంటే ఎక్కువ సమయం నిద్రపోయేలా చూసుకోవాలి.
- అలాగే చలికి చాలామంది వేడినీళ్ల స్నానానికి మొగ్గు చూపుతారు. అయితే వేడినీటి స్నానం జలుబు ఎక్కువ అయ్యేలా చేస్తుంది. కాబట్టి పిల్లలు ఉండే ప్రాంతం తేమగా కాకుండా వెచ్చదనం ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.
- రోజూ రాత్రి పడుకునే ముందు పిల్లలకు పాలల్లో పసుపు వేసి తాగించాలి. దీనివల్ల మంచి ఉపశమనం ఉంటుంది.
- మిరియాల పాలు కూడా పిల్లలకి ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే కొంతమంది పిల్లలు ఘాటుని తట్టుకోలేరు కాబట్టి ఈ విషయాన్ని గమనించి తాగించాలి.ా
- రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగిన నీటిలో తేనె కలిపి తాగించాలి.
- కొంచెం వాముని తీసుకుని, మెత్తగా దంచి చిటికెడు పరిమాణంలో రోజూ తీసుకుంటే పిల్లలకు జలుబు త్వరగా తగ్గుతుంది.ా
- నీళ్లల్లో తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. నీళ్లు చల్లారక, గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగించాలి.
- గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా దాల్చిన చెక్క పొడి, తేనెలను వేసి బాగా కలిపి తాగించాలి.
- యూకలిప్టస్ నూనెతో పిల్లల తల, ముక్కు, ఛాతీ భాగంలో బాగా మర్దన చేయడం వల్ల కూడా జలుబు త్వరగా తగ్గుతుంది. ఈ నూనెను అప్పుడప్పుడు వాసన చూపించడం వల్ల కూడా మంచి ఉపశమనం ఉంటుంది.ా
- కొంచెం పెద్ద వయస్సు పిల్లలు, జలుబుతో బాధపడుతున్నప్పుడు సెలైన్ డ్రాప్స్ ద్వారా ముక్కుని క్లీన్ చేయొచ్చు.