మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
- కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
రానున్న ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేశామని, సమర్థవంతంగా ఈ ప్రక్రియను చేపట్టి రైతాంగాన్ని సంతృప్తి పరచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణకు సమన్వయ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుకు లబ్ధిచేకూర్చే విధంగా ధాన్యం సేకరణ నిర్వహించాలని అధికారులను సూచించారు. గతేడాది ధాన్యం సేకరణలో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 3,800 వాహనాలను గుర్తించామని, వాటిలో 2,035 వాహనాలకు జిపిఎస్ అమర్చామని తెలియజేశారు. జిపిఎస్ అమర్చిన వాహనాలన్నింటినీ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ శనివారంలోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. మిల్లర్లు రైతుల నుంచి అన్లోడింగ్ ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వద్ద వెహికిల్ ఓనర్, డ్రైవర్ మొబైల్ నంబర్లు, చిరునామాలు ఉండాలన్నారు. రైతులు సచివాలయా లకు ధాన్యం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం తెలిపిన వెంటనే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ధాన్యం రవాణాకు వెహికిల్‌ను సిద్ధం చేసి మిల్లులకు ధాన్యం పంపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం మిల్లుకు చేరిన తర్వాత మిల్లర్లు అధికారులకు సమాచారం అందజేయాలన్నారు. ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. ధాన్యం రవాణాకు సంబంధించిన లారీ యజమానుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఆ సంఘ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. మిల్లుల వద్ద అన్ లోడింగ్ సమయంలో ధాన్యం నాణ్యత, తూకంలో రైతులు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ కొన్ని మండలాలకు వెహికల్ అందుబాటులో లేవని, స్థానికంగా ఉన్న వాహనాలకు జిపిఎస్ అమర్చడానికి చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖ అధికారులతో చర్చించినట్టు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా పౌర సరఫరాల అధికారి డి.వి.రమణ, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా సహకార అధికారి ఎస్.సుబ్బారావు, టెక్కలి సబ్ కలెక్టర్ నురుల్ కమర్, జిల్లా తూనికలు కొలతల అధికారి శంకర్ విశ్వేశ్వరరావు, శ్రీకాకుళం, పలాస ఆర్‌డిఒలు సిహెచ్.రంగయ్య, భరత్ నాయక్, జిల్లా మోటారు వాహనాల అధికారి పాల్గొన్నారు.