జాబ్‌ క్యాలెండర్‌ ఎప్పుడు..?

జాబ్‌ క్యాలెండర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారని అక్కులపేటకు చెందిన పేడాడ సాయి ప్రశాంత్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను ప్రశ్నించారు. మండలంలోని అక్కులపేటలో

స్పీకర్‌తో మాట్లాడుతున్న నిరుద్యోగి సాయిప్రశాంత్‌

  • స్పీకర్‌ను ప్రశ్నించిన నిరుద్యోగి

ప్రజాశక్తి – ఆమదాలవలస

జాబ్‌ క్యాలెండర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారని అక్కులపేటకు చెందిన పేడాడ సాయి ప్రశాంత్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను ప్రశ్నించారు. మండలంలోని అక్కులపేటలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ స్పీకర్‌ వెళ్తున్న క్రమంలో ఈ ప్రశ్న ఎదురైంది. నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీని చేపట్టలేదని, గ్రూపు-1, 2, డిఎస్‌సి పోస్టుల ఊసే లేకుండా పోయిందని సాయి ప్రశాంత్‌ స్పీకర్‌ దృష్టికి తీసుకొచ్చాడు. తనకు సిఎం జగన్‌ అంటే అభిమానమని, కానీ తన స్నేహితులు మేనిఫెస్టోలో ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌పై హేళన చేస్తున్నారని చెప్పారు. దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశామని, గ్రూపు-1, 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినట్లు తెలిపారు. ఎస్‌సి కాలనీకి చెందిన ముద్దాడ సింహాద్రి పథకాల పేరుతో డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి రోడ్డుపైకి ఆటోలతో వెళ్తుంటే రవాణా శాఖ, పోలీసులు చలానాల పేరుతో ఇచ్చిన డబ్బులు కంటే మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారని స్పీకర్‌కు తెలిపాడు. జలకళ పథకం కింద బోరు తవ్వించామని, నేటికీ బిల్లు మంజూరు కాలేదని గురుగుబెల్లి రమణమ్మ స్పీకర్‌ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి మంజూరు చేయిస్తామని స్పీకర్‌ హామీనిచ్చారు. 2020లో తన భర్త మరణించినా, నేటికీ వైఎస్‌ఆర్‌ బీమా మంజూరు కాలేదని కూర్మాన చిన్నమ్మడు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసాచార్యులపేటలో నేతన్న నేస్తం, చేయూత పథకాల డబ్బులు పడలేదని నీలవేణి స్పీకర్‌ దృష్టికి తీసుకొచ్చారు. పంట నష్టం, విద్యా దీవెన తనకు ఇచ్చినట్లు బుక్‌లెట్‌లో రాశారని, తనకు ఇవ్వని వాటిని ఇచ్చినట్లు ప్రచురించడం ఏమిటని బొడ్డేపల్లి శ్యామలరావు స్పీకర్‌ను ప్రశ్నించారు. స్పీకర్‌ సంబంధిత అధికారులను పిలిచి, ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. నాసిక శకుంతల ఒంటరి మహిళగా జీవిస్తున్నానని, తనకు పెన్షన్‌ రావడం లేదని స్పీకర్‌కు చెప్పారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్‌ ఇచ్చే వారని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని స్పీకర్‌ బదులిచ్చారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎస్‌.వాసుదేవరావు, వైద్యాధికారి మీనాక్షి, మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు, విద్యుత్‌ ఎఇ రవికుమార్‌, ఎపిఎం పైడి కూర్మారావు, ఎపిఒ లక్ష్మీనరసమ్మ, మాజీ ఎంపిటిసి గురుగుబెల్లి ప్రభాకరరావు, గురుగుబెల్లి నీలారావు, మెట్ట ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️