చేసిన అభివృద్ధి చూపించండి : టిడిపి

Nov 26,2023 21:36

 విలేకరుల సమావేశంలో టిడిపి నాయకులు

      హిందూపురం : వైసిపి అధికారంలోకి వచ్చినప్పటికి హిందూపురం నియోజక వర్గంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని అభివృద్ధి చేసి ఉంటే చూపించాలని టిడిపి నాయకులు సవాల్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆపార్టీ పట్టణ అధ్యక్షులు రమేష్‌ కుమార్‌, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌, అంజినప్ప, సతీష్‌ కుమార్‌ మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటిని నుంచి హిందూపురం నియోజకవర్గంలో పంపకాలు, నాయకుల విబేధాలతోనే సమయం అంత అయిపోయిందన్నారు. నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ దీపికమ్మ ఆర్బాటలకే తప్ప అభివృద్ధిపై దృష్టి సారించడం లేదన్నారు. పురపాలక సంఘంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడచినప్పటికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెట్టిన తొలి సంతకం పని ఇంకా పూర్తి కాలేదన్నారు. పట్టణంలో రోడ్లన్నీ గుంతలుగా మారినప్పటికి కనీసం ఆ గుంతలను పూడ్చడం లేదన్నారు. ఇక అసుపత్రి అధ్వానంగా మారిందన్నారు. అభివృద్ధి విషయంలో తాము బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బాలయ్య మూడో సారి గెలిచి హ్యాట్రిక్‌ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు, ఈ సమావేశంలో టిడిపి నాయకులు ఆనంద్‌, నజీర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️