సంక్షేమ బోర్డు రక్షణకు ఐక్య పోరాటాలు

 ప్రజాశక్తి – వంగర :  ప్రభుత్వం అనుసరిస్తున్న భవన నిర్మాణ కార్మిక వ్యతిరేక విధానాలపై నిర్మాణరంగ కార్మికులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల రెండో మహాసభ శనివారం ఉత్సాహంగా జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అరటి కట్ల ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం సెస్‌ రూపంలో వసూలు చేస్తున్న డబ్బులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయాలన్న చట్టం ఉన్నప్పటికీ అలా చేయకుండా టిడిపి అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల కోసం, వైసిపి ప్రభుత్వం నవరత్నాల పథకాలు కోసం ఖర్చు పెట్టడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వారి సంక్షేమ నిధులను సైతం ఇతర అవసరాలకు మళ్లించి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 27 28 తేదీల్లో విజయవాడలో జరిగే మహాధర్నాలో కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి శంకరరావు, కె. సురేష్‌ మాట్లాడుతూ , భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి అనేక రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికుల కోసం అనేక పథకాలు పెడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇసుక కొరత ఏర్పడి నిర్మాణ రంగ ధరలు అధికంగా పెరిగిపోవడంతో పనులు లేక కార్మికులంతా వలసలు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు భవనిర్మాణ కార్మిక చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమణ మాట్లాడుతూ పెండింగ్‌ లో ఉన్న గుర్తింపు కార్డులను, క్లయిమ్‌లను వెంటనే విడుదల చేయాలని, నిర్మాణ రంగాన్ని బలోపేతం చేయాలని, ధరలు తగ్గించి పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రామ్మూర్తి నాయుడు పి విశ్వనాథం, ఎం. త్రినాధ రావు, అసిరప్పడు, పారిచర్ల రామారావు, గౌరు నాయుడు, వెంకట నాయుడు, వివిధ గ్రామాలకు చెందిన భవనిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.నూతన కమిటీ ఎన్నికఅనంతరం మండల నూతన కమిటీ ఎన్నికైంది. గౌరవ అధ్యక్షులుగా పోరెడ్డి విశ్వనాథం, అధ్యక్షులుగా అరటి కట్ల ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శిగా బొడ్రోతు గౌరు నాయుడు, ఉపాధ్యక్షులుగా పారి చర్ల రామారావు, కోశాధికారిగా లొట్టి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా కాబోతుల గౌరు నాయుడు వీరితో పాటు మరో 20 మందిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

➡️