నూతన విద్యా విధానం(ఎన్ఇపి)-2020లో భాగంగా పాఠశాల పాఠ్య ప్రణాళికను సవరించేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) చేస్తున్న కసరత్తు వరుస వివాదాలను మూటగట్టుకుంటోంది. పాఠ్యపుస్తకాల్లో ఎక్కడెక్కడ అయితే ‘ఇండియా’ అని ఉందో ఆ స్థానంలో ‘భారత్’ అని మర్చాలంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మనసెరిగి చేసిన ప్రతిపాదనపై విమర్శల జడి తడారకముందే మరో విడ్డూరమైన ప్రతిపాదనలను ఎన్‌సిఇఆర్‌టి తెరపైకి తీసుకొచ్చింది. రామాయణం, మహాభారతం ఇతిహాసాలను పాఠశాల స్థాయి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాలంటూ ఎన్‌సిఇఆర్‌టి ప్రతిపాదించింది. చరిత్రలో కాల్పనిక గాథలు జొప్పించడమేంటని ఇప్పుడు మేధోవర్గం విస్తుపోతోంది. చరిత్ర అంటే కాలగర్భంలో నిబిడీకృతమైన వాస్తవాల సమాహార మాలిక. గతించిన వాస్తవాలను చెరిపివేయడం ఎవ్వరి తరమూ కాదు. మనుషుల్నీ, వస్తువుల్నీ, సంస్కృతినీ సృష్టించేది మనిషే. కావున ఏపాటి యత్నానికైనా మనిషే ప్రమాణం కావాలని కార్ల్‌మార్క్స్ చెబుతారు. ‘దేశమంటే మట్టికాదోరు..దేశమంటే మనుషులోరు’ అని గురజాడ వెంకట అప్పారావు నినదిస్తే…’మానవుడే నా సందేశం’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. చరిత్ర అంటే మనుషుల చరిత్ర. మనిషి ప్రమేయమున్న వాస్తవ అంశాల మాలిక. అంతేకాని కాల్పనిక కథలు, ఇతిహాసాలు చరిత్ర ఏనాటికీ కాబోవు. ఎందుకంటే అవి ఊహాజనితం. మహారచయితలు, వాగ్గేయకారులు, సాహితీవేత్తల ఆలోచనల్లో మాత్రమే పురుడు పోసుకున్న కల్పిత పాత్రల సమాహారం. ఆయా కాలాల్లో నాటి మనిషి ఆలోచనల్లో ఉదయించిన రచనలు నాటి సామాజిక పరిస్థితులను పోలి ఉండవచ్చు. కానీ అవి వాస్తవాలు కాబోవు. చారిత్రిక ఘటనలుగా మారిపోవు. ఎన్‌సిఇఆర్‌టి అత్యున్నత కమిటీ ఈ తేడానే చెరిపేయాలని చూస్తోంది. రాజ్యాంగ సంస్థలను, చరిత్ర, పరిశోధన సంస్థలను ఇప్పటికే సంఫ్‌ు పరివార్ అడ్డాలుగా మార్చేసిన మోడీ సర్కార్ ఎన్‌సిఇఆర్‌టి ద్వారా మొత్తం దేశ విద్యావ్యవస్థనే కాషాయీకరించే బృహత్ కుట్ర పన్నిందనడానికి ఈ ప్రతిపాదనలే నిదర్శనం. కోవిడ్ సమయంలో విద్యార్థులపై అధ్యయన భారం తగ్గించే పేరుతో ప్రజాతంత్ర, లౌకికవాద భావాలను పెంపొందించే పాఠ్యాంశాలను, పిల్లల్లో దేశభక్తిని పెంపొందించే భగత్‌సింగ్ లాంటి విప్లవ కిశోరాల అధ్యాయాలను తొలగించివేసింది. ఇప్పుడు మరింత బరితెగింపుతో హిందూత్వ ఎజెండాను నూరిపోసేందుకు సిద్ధమైంది. అందుకనే సామాజిక శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యాంశాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సి.ఐ ఐజాక్ (71) నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో ఎన్‌సిఇఆర్‌టి గతేడాది ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. భారతీయ విచార కేంద్రం ఉపాధ్యక్షులుగా గతంలో పనిచేసిన ఐజాక్‌కు సంఫ్‌ు పరివార్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన నేతృత్వంలోని కమిటీయే పాఠ్యాంశాలను కాషాయీకరించి చిన్నారుల లేలేత మనుసుల్లో మతతత్వ క్రిములను పెంచే కార్యాన్ని భుజానకెత్తుకుంది. ఎన్‌సిఇఆర్‌టి ప్రతిపాదిస్తున్న పాఠ్యాంశాలు 7వ తరగతి నుంచి 12వ తరగతికి సంబంధించినవి. విద్యార్థులకు ఇది కౌమార దశ. పసితనం పోయి భావాలు వికసించే కీలకమైన దశ. ఈ దశలో హిందూత్వాన్ని నూరిపోస్తే భారతదేశంలో మతరాజ్య స్థాపనకు అడ్డు వుండదనే కుట్రలో భాగంగానే వినాశకర విధానాలకు తెరలేపినట్లు కనిపిస్తోంది. పురాణ సాహిత్యంలో రామాయణం, మహాభారతాలు ప్రాముఖ్యతను ఎవ్వరూ కాదనరు. మన దేశంలోనే దాదాపు 300 రకాల రామాయణాలున్నట్లు అంచనా. చరిత్రగా అధ్యయనం చేయాలంటే ప్రామాణికత ఉండాలి. 300 రామాయణాల్లో ఏ రామయణం బోధిస్తారు? అందువల్ల ఎన్‌సిఇఆర్‌టి ప్రతిపాదనలు హాస్యాస్పదం. హిందూత్వ ఎజెండాతో బలవంతంగా రుద్దుతున్న ఎన్ఇపి ని ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలి. వినాశకరమైన ఈ విధానాలపై పోరాడేందుకు ఇటీవల 16 విద్యార్థి సంఘాలు ఐక్య కూటమిగా ఏర్పాటయ్యాయి. భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యా వ్యవస్థ కాషాయీకరణ కాకూడదంటే ప్రజలంతా ఎన్ఇపి వ్యతిరేక పోరాటాల్లో భాగమై కేంద్ర కుయుక్తులను అడ్డుకోవాలి.