సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు ఏసురత్నం
ఆశాలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి
– అదనపు పనులు చేయించరాదు : సిఐటియు
ప్రజాశక్తి – నంద్యాల
ఆశ కార్యకర్తలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, ఆశా కార్యకర్తలతో అదనపు పనులు చేయించరాదని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.ఏసురత్నం, జిల్లా సహాయ కార్యదర్శి వి.బాల వెంకట్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి.రమణ కుమారిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నంద్యాలలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు నాగమణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఆశా కార్యకర్తలతో సెంటర్లో క్లీనింగ్ చేయిస్తున్నారని అన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సెంటర్లో ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఆశా కార్యకర్తలు ఫీల్డ్ వర్క్ చేస్తారు తప్ప సెంటర్లో ఉంచరాదని అన్నారు. జిల్లా వైద్యాధికారి సమక్షంలో యూనియన్ నాయకులతో జరిగిన జాయింట్ మీటింగ్‌కు సంబంధించిన అంశాలు పీహెచ్సీ స్థాయిలో అమలు కావడం లేదన్నారు. గత ప్రభుత్వ కాలంలో మంత్రుల సమక్షంలో జరిగిన మినిట్స్ కాపీ డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలకు రికార్డ్స్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటి స్థలం, పక్కా గృహం నిర్మించి ఇవ్వాలన్నారు. వితంతు, వృద్ధాప్య, ఒంటరి మహిళ పింఛన్లు ఇవ్వాలని, గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని, ఎన్నికల సందర్భంగా టిడిపి ప్రభుత్వం వాగ్దానం వేసిన విధంగా వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సువర్ణమ్మ, చెన్నమ్మ, హేమలత, aపార్వతి, సుమలత, సుజాత, పుష్పావతి, నాగమణి, రాజమ్మ, విజయలక్ష్మి, ప్రభావతి, షమీం, నజురునిస తదితరులు పాల్గొన్నారు.