సర్వజన ఆసుపత్రిలో గిరిజన వైద్యానికి ప్రత్యేక విభాగం

Feb 29,2024 21:13

ప్రజాశక్తి-విజయనగరం  : వైద్యం కోసం గిరిజనులు చేరిన వెంటనే వారికి మెరుగైన సత్వర సేవలు అందించేందుకు వీలుగా స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒక ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి సూచిస్తానని రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి శంకరరావు చెప్పారు. ఈ సెల్‌ ఏర్పాటు ద్వారా ప్రత్యేక వైద్య(రెఫరల్‌) సేవలు పొందేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చే గిరిజనులకు సత్వర వైద్యసేవలు అందడంతో పాటు వారికి అందించే వైద్యసేవలపై ప్రత్యేక శ్రద్ద వహించే అవకాశం వుంటుందన్నారు. విశాఖపట్నంలోనూ, పార్వతీపురం ఆసుపత్రిలోనూ ఇటువంటి సెల్‌లు ఏర్పాటు చేశారని, వీటివల్ల మంచి ఫలితాలు వుంటున్నాయని చెప్పారు. సాలూరు మండలం విజయరాంపురం వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి వ్యాన్‌ బోల్తాపడిన ఘటనలో గాయపడి స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తొమ్మిది మంది గిరిజనులను ఎస్‌.టి.కమిషన్‌ ఛైర్మన్‌ గురువారం పరామర్శించారు. చికిత్స పొందుతున్న గిరిజనుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సహాయం గురించి తెలుసుకోవడంతోపాటు అక్కడి వైద్యులతో మాట్లాడి ప్రమాద అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని కోరారు.. బాధితులకు మరింత వైద్యసేవలు అందించేలా ఐటిడిఎ, ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామన్నారు.అనంతరం ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ పలు జిల్లాల్లో గిరిజన విద్యార్ధుల మరణాలు ఇటీవలి కాలంలో వరుసగా సంభవిస్తున్నాయని, తాను కూడా పలు ప్రాంతాలను సందర్శించానని చెప్పారు. అయితే ఈ మరణాలన్నీ ఒకే కారణంతో జరగడం లేదని, వేర్వేరు కారణాలతో సంభవిస్తున్నట్టు తెలుస్తోందని చెప్పారు. గిరిజన విద్యార్ధుల మరణాలకు కారణాలను తెలుసుకొని వాటిని భవిష్యత్తులో పునరావృతం కాకుండా నివారించేందుకు వైద్య నిపుణులు, విద్యా రంగ నిపుణులతో కమిటీ వేసి సమగ్ర అధ్యయనం జరిపించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు చెప్పారు. దీనివల్ల దీర్ఘకాలిక ఫలితాలు వుంటాయన్నారు. ఈ పర్యటనలో ఆర్‌ఎంఒ డాక్టర్‌ సురేష్‌, కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగం హెచ్‌ఒడి డాక్టర్‌ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️