ఎన్నికల ఫలితాల తరువాత .. ఇండియా ఫోరం భేటీ

  • భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, దేశాన్ని రక్షించడానికి మెరుగైన ప్రభుత్వం అవసరమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఇండియా బ్లాక్‌ నేతలంతా కలిసి కూర్చుని తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు. కోయంబత్తూరులో సిపిఎం శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీతారాం ఏచూరి మాట్లాడారు. ”ఇవి చాలా గట్టి పోటీ ఉన్న ఎన్నికలు కాబట్టి, ప్రధానమంత్రి, హోం మంత్రి, మొత్తం క్యాబినెట్‌ తీవ్రమైన ప్రచారం చేసినప్పటికీ బిజెపికి, ప్రధాని మోడీకి గెలుపు అంత తేలికైనది కాదు” అని అన్నారు. నిరుద్యోగిత రేటు రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని, ప్రపంచ ఆహార సూచీలో భారత్‌ స్థానం మరింత దిగజారిందని, ప్రజాసంక్షేమం మంటగలిసిందని ఏచూరి విమర్శించారు. గత ఏడాది 40,000కు పైగా కార్పొరేట్‌ సంస్థలు ఆదాయపు పన్ను పరిధి నుంచి బయటికి వెళ్లాయని పేర్కొన్నారు. ఏప్రిల్‌ – సెప్టెంబర్‌ మధ్య కాలంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 77 శాతం తగ్గాయని పేర్కొన్నారు.ఇండియా ఫోరమ్‌ను మరింత బలోపేతం చేసేందుకు సిపిఎం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తన అసమర్థ పాలనకు ఫలితాన్ని చవిచూస్తుందని ఏచూరి అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ బిజెపి భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రభుత్వ మార్పు తప్పక జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో రాజ్యాంగం ప్రకటించిన భారత దేశాన్ని కాపాడుకోవడం కోసం మెరుగైన ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరముందన్నారు. ఇండియా ఫోరమ్‌ను మరింత బలోపేతం చేసేందుకు సిపిఎం కట్టుబడి ఉంది” అని సీతారాం ఏచూరి అన్నారు. ఇండియా బ్లాక్‌ సమావేశాల్లో సీట్ల సర్దుబాట్లకు సంబంధించిన అన్ని అంశాలు రాష్ట్రానికి సంబంధించినవిగా నిర్ణయించబడ్డాయని అన్నారు. ”సాధారణ జనాభా గణనతోపాటు కుల గణన కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఇది సుదీర్ఘంగా ఉన్న అంశం” అని అన్నారు.

యునెస్కో ఎగ్జిక్యూటివ్‌కు జరిగిన ఎన్నికలలో ఆసియా ప్రతినిధిగా పాకిస్థాన్‌కు 38 ఓట్లు రాగా, భారత్‌కు 18 ఓట్లు మాత్రమే వచ్చాయి. ”గ్లోబల్‌ సౌత్‌కు నాయకులమైతే, ఇది ఎందుకు జరుగుతోంది? దీనికి సమాధానం చెప్పాలి” అని ఆయన డిమాండ్‌ చేశారు. యుఎస్‌ ఇటీవల చేసిన ఆరోపణ (ఖలిస్తాన్‌ వేర్పాటువాదులను చంపే పన్నాగంతో ఒక భారతీయ అధికారిని లింక్‌ చేయడం), యుఎస్‌ కోర్టులో సాక్ష్యాధారాలతో, వ్యక్తుల పేర్లతో దాఖలు చేసిన కేసుపై మోడీ ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పాలని అన్నారు.

తమిళనాడు అభివృద్ధికి బిజెపి లేదా కమ్యూనిస్టు పార్టీలు ఏ పార్టీ ఎక్కువ సహకారం అందించిందో బహిరంగ చర్చకు రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలైకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె. బాలకృష్ణన్‌ సవాల్‌ విసిరారు. అన్నాడిఎంకె ఎప్పుడూ బిజెపికి ”బి” టీమ్‌గా పని చేస్తుందని, ఇటీవల అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌లో 10 బిల్లులు మళ్లీ ఆమోదించబడినప్పుడు కూడా సభ నుండి వాకౌట్‌ చేసిందని ఆయన గుర్తు చేశారు. ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యను సిపిఎం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని, దీనిపై ఆందోళన కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️