ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఓటరు నమోదు, ఓటరు జాబితాలో సవరణల కోసం ఈనెల 2, 3 తేదీల్లో ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ రెండు రోజులు ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బిఎల్‌ఒలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఇఆర్‌ఒలు విస్తృతంగా ప్రచారం నిర్వహించి, 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటు హక్కు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. బూత్ స్థాయి అధికారులు తమ విధుల్లో ఎలాంటి అలసత్వం చూపరాదన్నారు. కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం-6, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు తదితర అంశాలు ఏమైనా ఉంటే ప్రజలు వారిని సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.యువ ఓటర్ల నమోదుకు చర్యలుయువ ఓటర్ల నమోదుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ప్రత్యేకంగా 30 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న 132 ఫారాలు, ఎస్‌ఎస్‌ఆర్-24 సమయంలో స్వీకరించిన ఫారాల గురించి వివరించారు. నెల రోజుల్లో 23,305 మంది 18-19 ఏళ్ల వారిని ఓటర్లుగా నమోదు చేశామని చెప్పారు. మరో తొమ్మిది వేల మందిని కొత్త ఓటర్ల జాబితాలో చేర్చాల్సి ఉందని అంచనా వేస్తున్నామన్నారు. ఫారం-6, 7, 8 దరఖాస్తులను నెల రోజుల్లో 65,716 స్వీకరించామని చెప్పారు. వీటిలో ఇంకా 13,661 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు.ఇవిఎం డిమానిస్ట్రేషన్ వాహనం ప్రారంభంఓటు హక్కు వినియోగంపై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరమని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ఇవిఎం డిమానిస్ట్రేషన్ సెంటర్, మొబైల్ ఇవిఎం డిమానిస్ట్రేషన్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఓటర్లకు ఇవిఎంలపై అవగాహన కల్పించడానికి ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ప్రత్యేక ఉప కలెక్టర్ జయదేవి, ఆర్‌డిఒ సిహెచ్.రంగయ్య, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్ తదితరులు పాల్గొన్నారు.