మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్, జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది వర్షాల్లేక, సాగునీరు అందక పంటలు పూర్తిగా ఎండిపోయాయని తెలిపారు. చెరువులు, కుంటల్లో ఇంజిన్లతో నీరు పెట్టడంతో పెట్టుబడి విపరీతంగా పెరిగినా, పంట మాత్రం చేతికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా తదితర జీవనదులున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఏటా కరువుకు గురవుతున్నట్లు తెలిపారు. ఈ కరువు ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చింది మాత్రమే కాదని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణం చేపడితే ఇచ్ఛాపురం వరకు 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు గానీ దశాబ్దాలుగా పాలకులు ప్రకటనలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు ప్రారంభించి 15 ఏళ్లు అయినా 50 శాతం పనులూ పూర్తి కాలేదన్నారు. వంశధార ఎడమ కాలువలో గుర్రపుడెక్క, తూటికాడ పిచ్చిమొక్కలతో కాలువలు పేరుకుపోయి నీరు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. వంశధార ఎడమ కాలువ ద్వారా 2400 క్యూసెక్కుల నీరు విడిచిపెట్టాల్సి ఉన్నా, కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో 1200 నుంచి 1300 క్యూసెక్కులకు మించి నీరు విడిచిపెట్టడం లేదని తెలిపారు. కాలువ నిర్వహణకు నిధులు కేటాయించి ఖరీఫ్ సీజన్‌కు ముందే పనులు పూర్తి చేయాలని అనేకసార్లు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దాని ఫలితంగానే రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట చేతికి రాక రైతులు తీవ్రంగా నష్టపోయి వలసలు పోతున్నా, అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గానీ కరువు తీవ్రతను గుర్తించడం లేదన్నారు. జిల్లాలో ఒక్క మండలాన్నీ కరువు మండలంగా ప్రకటించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనన్నారు. ప్రభుత్వం స్పందించి కరువు తీవ్రతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి కరువు సహాయక చర్యల కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని, రెండో పంటకు స్వల్పకాలిక విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలన్నారు. ఉపాధి హామీ పనులు రెట్టింపు చేసి గ్రామాల్లోనే పనులు కల్పించి వలసలు నివారించాలని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తగిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులు ఇంతవరకు ప్రారంభించలేదని, వెంటనే ప్రారంభించాలన్నారు.