ప్రజాశక్తి-మెంటాడ : ప్రజలు, పోలీసులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు పోలీసు శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోందని జిల్లా ఎస్పి ఎం.దీపికా పాటిల్ అన్నారు. అందులో భాగంగానే మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గురువారం మండలంలోని కొండలింగాలవలస పంచాయతీ శివారు సవరవల్లిలో తిరుమల-మెడికవర్, రోటరీ క్లబ్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పి మాట్లాడుతూ గిరిజనులకు అండగా నిలిచేందుకు కమ్యూనిటీ పోలీసింగులో భాగంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైతే శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగా చేస్తారని తెలిపారు. తమ పిల్లల చదువుపట్ల గిరిజనులు ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ఉన్నతులు గా తీర్చిదిద్దాలని కోరారు. రోటరీ అధ్యక్షులు డాక్టర్ కృష్ణశాంతి మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ఎవరికి వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్నందున ప్రాధమిక స్థాయిలోనే ఆరోగ్య సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన వైద్య సహాయాన్ని పొందాలని అన్నారు. బొొబ్బిలి డిఎస్పీ పి. శ్రీధర్ మాట్లాడుతూ ఇటువంటి వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు. గజపతినగరం సిఐ లెంక అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ మెగా వైద్య శిబిరం నిర్వహణతో కొండ లింగాలవలస గ్రామంతోపాటు చుట్టు ప్రక్కలగల మరో 14 గ్రామాలకు చెందిన గిరిజనులు చికిత్స పొందే వెసులుబాటు కలిగిందన్నారు. అనంతరం, ఎస్పి గ్రామంలోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని అభిలషించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థుల ఆసక్తులను ఎస్పి అడిగి తెలుసుకోగా ఒక విద్యార్థిని బి.సీత పోలీసు అవుతానని, మరో విద్యార్థి పి.రాజు లాయర్ అవుతానని చెప్పగా వారిని ఎస్పి అభినందిం చారు. ఉద్యోగాలు వచ్చినంత వరకు చదవాలని, మధ్యలో చదువు ఆపేయవద్దని సూచించారు. అనంతరం గిరిజన మహిళలకు చీరలు, పురుషులకు దుప్పట్లు, యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆండ్ర ఎస్ఐ సిద్ధార్ధ కుమార్, బొండపల్లి ఎస్ఐ రవి, మానాపురం ఎస్ఐ శిరీష, స్థానిక సర్పంచ్ పాడి వరహాలమ్మ, మాజీ సర్పంచ్ ఎస్ నాగమణి, ఎంపిటిసి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.