భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనేది అభివృద్ధి సమస్య కాదు, ఆదాయాల సమస్య. తగినంతగా ఆదాయాలు పెరగడం లేదు. అధిక సంఖ్యాకులకు అవి నిలకడగా లేవు. మొత్తం మీద స్థూల జాతీయ ఆదాయ అభివృద్ధి జరుగుతున్నా కూడా కులం, మతంతో సంబంధం లేకుండా ఆర్థిక బలహీనులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండాలని ఒత్తిడి పెరుగుతోంది.ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న ఆర్థికవేత్తలు ఆర్థిక వ్యవస్థ సరిపోయినన్ని ఉద్యోగాలు సృష్టిస్తున్నదా లేదా అని చర్చిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల్లో వున్న వాస్తవాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ముందున్న ప్రభుత్వం కాకుండా ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో తగినన్ని ఉద్యోగాలు సృష్టి కావడం లేదని ప్రభుత్వ వ్యతిరేక ఆర్థికవేత్తలు చెప్తున్నారు. గణాంకాలు సమస్యను వివరించలేవని, సరైన పరిష్కారాలు చూపించలేవని అంటున్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ
అమెరికా ఆర్థిక వ్యవస్థ గణాంకాలను చూస్తే అంతా బాగున్నట్లు అనిపిస్తుంది. కానీ అత్యధిక మంది ప్రజానీకం ఆర్థిక వ్యవస్థ పట్ల అసంతృప్తితో ఉన్నారు. వచ్చే సంవత్సరం నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల సంధర్భంలో ఇదో పెద్ద సమస్య కానుంది. తమ యజమానుల నుండి సరైన వేతన సవరణ కావాలంటూ సమ్మెలో ఉన్న మోటారు రంగ కార్మికుల దగ్గరకెెళ్ళి అమెరికా అధ్యక్షుడు సంఘీభావం తెలపాల్సిన పరిస్థితి వచ్చింది. కార్మికులు తమకు న్యాయమైన ఒప్పందం కావాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ ఆదాయాలకు రక్షణ కావాలన్నారు. మోటారు కంపెనీల అధిపతులు అత్యధిక స్థాయిలో వేతనాలు తీసుకుంటూ పోటీని తట్టుకునేందుకు తాము త్యాగాలు చేయాలని చెప్పటాన్ని విమర్శించిన కార్మికులతో అధ్యక్షుడు ఏకీభవించారు.
అవి మంచి ఉద్యోగాలు కావు
ఆర్థికవేత్తల ప్రకారం భారతదేశంలో ఉన్న ఆదాయాల సమస్య ఏమంటే వ్యవసాయం నుండి పారిశ్రామిక రంగం వైపు సరిపడినంతగా ప్రజలు తరల లేదు. భారతదేశ విధానకర్తలు 1990వ దశకంలో దగ్గర దారి కనిపెట్టామని భావించారు. వ్యవసాయ రంగం నుండి నేరుగా సర్వీసు రంగాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు. అమెరికా, చైనాల మాదిరిగా నిలకడైన అభివృద్ధి వైపు ఆలోచించలేదు. సమాచార సాంకేతిక రంగం నుండి ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊపును తెచ్చారు. ఈ దగ్గర దారి విఫలమైంది. భారతదేశంలో వున్న అత్యధిక యువతను ఈ అత్యున్నత స్థాయి రంగం తనలో ఇముడ్చుకోలేదు. ఈ రంగంలో పని చేయాలంటే అధికస్థాయి విద్య ఉండాలి. ఇది గ్రామీణ ప్రజలకు లేదు.వ్యవసాయం నుండి బయటకు వచ్చినపుడు వారి శక్తిసామర్థ్యాలకు తగిన ఉపాధి కావాలి. అక్కడి నుండి నిచ్చెనమెట్లు ఎక్కాలంటే అధిక నైపుణ్యాలను నేర్చుకుని అధిక ఆదాయం సంపాదించగలిగే ఉద్యోగాలు వారికి కావాలి. మొదటి అంచెలో శ్రమ తీవ్రత ఉండే ఉత్పాదక, సర్వీసు, నిర్మాణ రంగాలు ఆ అవకాశం కల్పిస్తాయి. వ్యవసాయ రంగం నుండి బయటకు వచ్చిన లక్షల మంది అటువంటి ఉద్యోగాల్లోకి ప్రవేశించారు.సమస్య ఏమంటే రంగంతో సంబంధం లేకుండా వారికి దొరికిన ఉద్యోగాలు అంత మంచివి కావు. వేతనాలు సరిగా ఉండవు. పైగా వారికి దొరికేది తాత్కాలిక లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే. సామాజిక భద్రత ఉండదు. నైపుణ్యాలు పెంచుకునేందుకు సహాయం ఉండదు. భారీ, ఆధునిక మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమల్లో కూడా కాంట్రాక్టర్ల ద్వారానే నియామకాలు జరుగుతున్నాయి. యజమానులు తమ ఖర్చును తగ్గించుకుంటున్నారు. పర్మినెంట్ కార్మికుల కంటే చాలా తక్కువగా వేతనాలు చెల్లిస్తున్నారు. వారి ఉపాధికి రక్షణ లేదు.ప్రపంచం ఒక మూల మలుపులో ఉంది. ఆర్థిక రంగంలో కొత్త ఆలోచనలు రావాలి. పర్యావరణ సహితమైన, సామాజిక సామరస్యమైన భవిష్యత్తును సృష్టించాలి. ఆ ఆలోచనల ప్రకారం అభివృద్ధిని, ఉద్యోగితను లెక్కించాలి. పనికి సంబంధించిన కొత్త భావాలు కావాలి. పని చేసే సంస్థల రూపకల్పన కూడా జరగాలి. ఈ సంస్థల్లో భాగస్వాముల మధ్య ఉండాల్సిన ఆర్థిక, సామాజిక సంబంధాలను కూడా మదింపు చేయాలి. పర్యావరణం పట్ల శ్రద్ధ పెరిగితే మరలా చిన్న సంస్థల అభివృద్ధి జరుగుతుంది.స్థిర పెట్టుబడిని పెంచి వేతనాల ఖర్చును తగ్గించుకునే భారీ సంస్థలకు బదులుగా వివిధ సంస్థలు తమ అభివృద్ధి కోసం ఒక దానికి మరోటి సహాయపడేవి నిలకడగా అభివృద్ధి చెందాలి. ప్రపంచం లోని దూరపు ప్రాంతాల వినిమయదారుల కోసం జరిగే ఉత్పత్తులకు బదులుగా స్థానిక వినిమయానికి, మార్కెట్లకు ఉత్పత్తి జరిగితే స్థానిక పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి.
సహాయకుల సేవలకు విలువ కట్టాలి
ఆర్థిక సామర్ధ్యాలు, మిగులును సృష్టించే కార్పొరేట్ సంస్థలకు బదులుగా వాస్తవ సామాజిక సంస్థలను సృష్టించే వైపు దృష్టి మరల్చాలి. సహాయకులు చేసే పనికి ఆర్థికవేత్తలు అధిక విలువ కట్టాలి. సాంప్రదాయకంగా కుటంబ సేవలో ఉన్న మహిళలు పరిశ్రమలు, కార్యాలయాలు, మాల్స్ వైపు తరలించబడుతున్నారు. వేతనాల కోసం సంఘటిత రంగంలో పని చేసే మహిళల పనికి మాత్రమే ఆర్థికవేత్తలు విలువ కడుతున్నారు. సంపాదన కోసం ఇతరుల ఇళ్లల్లో సహాయకులు చేసే పని లేదా కుటుంబ వ్యవసాయ క్షేత్రాల్లో చేసే అసంఘటిత పనికి విలువ లెక్కించడం లేదు. తమ కుటుంబీకుల సేవలో ఉన్న మహిళల పనిలో ఉన్న విలువను చూడటం లేదు. సంఘటిత ఆర్థిక సంస్థలుగా ఉన్న కార్పొరేట్ సంస్థలకు అనుకూలించే విధంగా సామాజిక సంస్థలను వక్రీకరించే ఆర్థిక సిద్ధాంతాలు ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి. మానవులు ఒకరికొకరు సహాయపడటం తగ్గిపోయి డబ్బు ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది. ఇరవయ్యవ శతాబ్దపు ఆర్థికాభివృద్ధి భావనలోకి మరింత కాలంపాటు ఆర్థికాభివృద్ధి మరియు ఉద్యోగిత కొలమానాలు కూరుకుపోకూడదు. మనకు భవిష్యత్తులో అవసరమయ్యే పని రూపాలు సంస్థల్లో ప్రతిబింబించే విధంగా వాటిని సంస్కరించాలి. కార్మికులు, చిన్నరైతులు, చిన్న పెట్టుబడిదారులు, మహిళలకు ప్రస్తుత ఆర్థిక నమూనా విలువ ఇవ్వడం లేదు. వారు చెప్పేది వినే విధంగా విధాన రూప ప్రక్రియ వైపు మరలాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆర్థిక నిపుణులు, పెద్ద ఆర్థిక సంస్థలు, బడా వ్యాపార కార్పొరేషన్లు వారి భావాలను కొట్టివేస్తున్నాయి. భవిష్యత్తులో మంచి విధానం కోసం చారిత్రిక గణాంకాలకు బదులుగా…తాము ఎదుర్కొనే సమస్యల గురించి పజలు చెప్పే వాటిని వినాలి.
– అరుణ్ మైరా, (‘ది హిందూ’ సౌజన్యంతో స్వేచ్ఛానుసరణ)