న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తమ వాహనాలను ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు లగ్జరీ కార్ల కంపెనీ ఆడి కూడా ధరలను హెచ్చించనుంది. వచ్చే కొత్త ఏడాది జనవరి నుంచి ధరల పెంపు అమల్లోకి వస్తుందని ఇరు కంపెనీలు వేరు వేరు ప్రకటనల్లో తెలిపాయి. ద్రవ్యోల్బణం, ముడి సరకు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మారుతి సుజుకి పేర్కొంది. జనవరి నుంచి ఈ ధరల పెంపు వర్తిస్తుందని సోమవారం ఆ కంపెనీ రెగ్యూలేటరీ వెల్లడించింది. మారుతి విక్రయిస్తున్న ఆల్టో నుంచి ఇన్‌విక్టో వరకు ధరల శ్రేణీ రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షలుగా ఉన్నాయి. నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో తమ వాహన ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ఆడి వెల్లడించింది. ఈ నిర్ణయం జనవరి 1నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ముడి సరుకుల ధరల పెరుగుదలకు తోడు డీలర్ల మనుగడ కోసం ధరలను పెంచాల్సి వచ్చిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఆడి కార్ల ధరలు రూ.42.77 లక్షల నుంచి రూ.2.22 కోట్ల మధ్య ఉన్నాయి.