పోస్టర్, లోగోను ఆవిష్కరిస్తున్న కలెక్టర్, జెసి
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
డిసెంబరు 15 నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు నిర్వహించే ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. పోటీలకు సంబంధించిన పోస్టర్, లోగోలను జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి జెడ్పి సమావేశ మందిరంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రాలో భాగంగా క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్‌తో పాటు 3కె మారథాన్, యోగా, టెన్నికాయిట్ ఆయా ప్రాంతాల్లోని సాంప్రదాయ ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 15 ఏళ్లు నిండిన వారు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని, వారికి క్రీడల్లో ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. పురుషులు, మహిళల కోసం ఐదు విభాగాల్లో గ్రామ సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో వేర్వేరుగా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాలు నివాసంగా ఉండాలన్నారు. ఆధార్ గానీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డుతో గానీ పోటీలకు నమోదు చేసుకోవాలని సూచించారు. మండల స్థాయి పోటీల్లో విజేతలకు నియోజకవర్గాల స్థాయిలో.. నియోజకవర్గాల పోటీల్లో విజేతలకు జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలకు సంబంధించి విజేతలకు నియోజకవర్గ స్థాయిలో ప్రథమ బహుమతి రూ.35 వేలు, జిల్లాస్థాయిలో రూ.60 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, జిల్లాస్థాయిలో రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.పది వేలు అందజేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రస్థాయి విజేతలకు ప్రథమ బహుమతి రూ.ఐదు లక్షలు, ద్వితీయ బహుమతి రూ.మూడు లక్షలు, తృతీయ బహుమతి రూ.రెండు లక్షలు అందజేయనున్నట్లు వివరించారు. ఈ క్రీడల్లో పాల్గొనే ఔత్సాహికులు షషష.aaసబసaఎaఅసష్ట్రతీa.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో గానీ, వాలంటీర్ల వద్ద గానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సెట్‌శ్రీ సిఇఒ ప్రసాదరావు, డిఇఒ వెంకటేశ్వరరావు, డిఎస్‌డిఒ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.