ప్రజాశక్తి – బొబ్బిలిరూరల్ : బొబ్బిలి, తెర్లాం రోడ్డులో ప్రయాణం చేయాలంటే భయం, భయంగా ఉందని చోదకులు వాపోతున్నారు. విశాఖపట్నం నుండి రాయగడ, రాయగడ నుండి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలు గతంలో పారాది మీదుగా వెళ్ళేవి ప్రస్తుతం పారాది వంతెన పాడవడంతో భారీ వాహనాలు బొబ్బిలి మీదుగా తెర్తాం రోడ్డు ఆకులకట్ట మీదుగా బాడంగి, రామభద్రపురం నుండి హైవే చేరుకొని విశాఖ, రాయగడ రాక పోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో బొబ్బిలి, తెర్లాం రోడ్డు భారీ వాహనాలు తిరగడంతో పూర్తిగా పాడై పోవడంతో భారీ వాహన చోదకులు, శ్రీకాకుళం, రాజాం, బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రతి రోజు భయం భయంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఈ రహదారిలో ప్రతిరోజు భారీ వాహనాలు గోతుల్లో కూరుకు పోవడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఆర్అండ్బి అధికారులను వివరణ కోరగా 10 టన్నుల సామర్థ్యం గల రోడ్లలో 40, 50 టన్నుల భారీ వాహనాలు వెళ్లడం వల్లనే ఈ రోడ్లు పాడయ్యాయని చెప్పారు.