ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు
గోరంట్ల : గోరంట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు రోజుల క్రితం ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ కాన్ను అనంతరం మరణించింది. మగబిడ్డకు జన్మనించిన ఆమె ఆ తరువాత తీవ్ర రక్తస్రావంతో మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె మృతి చెందిదంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట శనివారం ఉదయం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బాధితకుటుంబ సభ్యులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… గోరంట్ల పట్టణం 6వ వార్డుకు చెందిన షాహిద్ భార్య జబినా(31) 3వ కాన్పు నిమిత్తం ఈ నెల 17వ తేదీన గోరంట్ల ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఆమె మగబిడ్డకు జన్మనించారు. ప్రసవం అయిన కొద్దిసేపటి తర్వాత తీవ్ర రక్తస్రావంతో ఆమె ఇబ్బంది పడ్డారు. దీనిపై అక్కడున్న ఆమె బంధువులు వైద్యులకు తెలిపారు. దీనిపై వైద్యులు సరైన రీతిలో స్పందించలేదు. మహిళ పరిస్థితి విషమం కావడంతో రాత్రి 10 గంటల సమయంలో వైద్యులు మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని రెఫర్ చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హిందూపురానికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు సమస్య తీవ్రంగా ఉందని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతానికి వెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు బెంగుళూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 23న మహిళ మరణించారు. మహిళకు కాన్పు అయిన వెంటనే రక్తస్రావం కాకుండా వైద్యులు మెరుగైన వైద్యం అందించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదంటూ అక్కడి వైద్యులు వారికి తెలిపారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు గోరంట్ల వైద్యులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఎదుట ఆందోళన వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మహిళ మృతి చెందిందని బాధితురాలి కుటుంబ సభ్యులు శనివారం ఉదయం గోరంట్ల ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి టిడిపి, జనసేన, సిపిఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ వైద్యం అందక బాలింత మృతి చెందడం అంత్య బాధాకరమైన విషయం అన్నారు. సరైన సమయంలో సక్రంగా వైద్యం అందించి ఉంటే మహిళ మరణించి ఉండేది కాదన్నారు. ఇందుకు ఆసపత్రి వైద్యులే బాధ్యత వహించాలన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.20 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వైద్య చికిత్సలు అందించకుండా నిర్లక్ష్యం చేసిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి వైద్యులు ఆందోళనకారులతో మాట్లాడుతూ తాము అన్ని విధాలా మహిళకు మెరుగైన వైద్యం అందించామని, కాగ తీవ్ర రక్తస్రావం కావడం వల్లనే ఆమె మరణించిందని వారికి సర్ధిచెప్పారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు పంపుతామని వారికి చెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు టిడిపి కార్యదర్శి నరసింహులు, మండల ప్రధాన కార్యదర్శి అశ్వర్థరెడ్డి, జనసేన పార్టీ నాయకులు సురేష్, సంతోష్, వెంకటేష్, సిపిఐ నాయకులు శ్రీరాములు పాల్గొన్నారు.