అమెరికా, ఇతర పశ్చిమదేశాల పూర్తి మద్దతుతో ఇజ్రాయిల్ గాజాలో సృష్టిస్తున్న మారణహోమం 21వ శతాబ్దంలో మానవాళిపై జరిగిన అత్యంత అనాగరికమైన చర్య. ముక్కుపచ్చలారని పసివారిని సైతం బలి తీసుకున్న రక్తపిశాచిగా నెతన్యాహు చరిత్రలో మిగిలిపోతాడు. జాతి నిర్మూలనే లక్ష్యంగా ఫాసిస్టు నెతన్యాహు ప్రభుత్వం సాగిస్తున్న క్రూర, భయంకర దాడులను ఆపాలని కోరుతూ, ప్రపంచ వ్యాపితంగా పాలస్తీనా సంఘీభావ ర్యాలీలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. బందీల విడుదల, తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ యుద్ధం ఆగదని నెతన్యాహు హూంకరిస్తున్నాడు. అక్టోబరు 7న హమాస్ జరిపిన రాకెట్ల దాడిని సాకుగా చూపి.. గాజా నుంచి పాలస్తీనీయులను పూర్తిగా తరిమేసి, ఆ ప్రాంతాన్నీ కబళించాలని చూస్తున్నాడు. పశ్చిమాసియాలో తమ సైనిక బంటుగా ఉన్న ఇజ్రాయిల్‌కు ఆయుధాలు, డబ్బు ఇచ్చి.. అమెరికన్ సామ్రాజ్యవాదం ఈ దాడులను ప్రాంతీయ యుద్ధంగా మార్చాలని చూస్తోంది. ఈ నెల ‘అంతర్జాతీయ పాలస్తీనా సంఘీభావ దినోత్సవం’ కూడా. వీటన్నింటి నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం.
పాలస్తీనాపై ఏడు వారాలుగా సాగుతున్న ఈ మారణహోమంలో ఇంతవరకు దాదాపు 13 వేల మంది వరకూ పాలస్తీనీయులు మరణించారు. వీరిలో మూడింట రెండొంతుల మంది పిల్లలు, మహిళలే. ఇంకా అనేక వేల మంది గాయపడ్డారు. లక్షలాది మందిని బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయించి, గుక్కెడు మంచి నీరు కూడా పుట్టని ఎడారి ప్రాంతానికి తరిమేస్తున్నారు. ఇళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు, చర్చిలు, మసీదులు అన్న విచక్షణ కూడా లేకుండా ఇజ్రాయిల్ సైన్యం, సెట్లర్ గ్యాంగ్‌లు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నాయి. రాత్రిపూట ఎక్కుగా ఈ దాడులు జరుగుతున్నాయి. దీంతో తప్పించుకునే మార్గం కూడా లేక మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా చనిపోతున్నారు. గాజా సిటీలోని రెండు ప్రధాన ఆసుపత్రులైన అల్-షిఫా, అల్-ఖుద్స్‌పైనా ఇజ్రాయిల్ సైన్యం బాంబుల వర్షం కురిపించాయి. ఇజ్రాయిల్ ఘాతుకానికి వందల సంఖ్యలో నవజాత శిశువులు చనిపోయారు. వైద్య సిబ్బంది, రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, పరుగులు తీశారు. ఆ రెండు ఆసుపత్రులు మూతపడేట్లు చేశారు. గాజాస్ట్రిప్‌ను అష్ట దిగ్బంధనం గావించి.. నీరు, ఆహారం, మందులు, ఇంధనం, విద్యుత్ సరఫరాను పూర్తిగా బంద్ చేసింది. ఇంటర్నెట్, కమ్యూనికేషన్స్‌ను నిలిపేసింది. మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. బయట నుంచి మానవతా సాయాన్ని సైతం పాలస్తీనా ప్రజలకు అందకుండా ఆంక్షల మీద ఆంక్షలు విధిస్తోంది. దీంతో ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదముందని ప్రపంచ ఆహార సంస్థ (ఎఫ్‌ఎఒ) హెచ్చరించింది. చివరికి ఇదొక పెను విపత్తుగా మారే ప్రమాదమేర్పడింది.
పాపాల భైరవుడు నెతన్యాహు..
ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఓ పెద్ద పాపాల భైరవుడు. పాలస్తీనీయులను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో జాతి నిర్మూలన నేరాల కింద ఒక దేశ నాయకుణ్ణి విచారించాల్సి వస్తే మొట్టమొదట విచారించాల్సిన యుద్ధ నేరస్తుడు నెతన్యాహునే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. నెతన్యాహును యుద్ధ నేరాల కింద విచారించాలని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమల్ ఫొసా ఇప్పటికే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును కోరారు. గాజా, వెస్ట్ బ్యాంక్‌ల్లో ఇజ్రాయిల్ ఆక్రమణలు, అవమానకరమైన ఆంక్షలతో పాలస్తీనీయులు తీవ్ర దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నా, పనులు ముగించుకుని తిరిగి ఇంటికి రావాలన్నా అడుగడుగున ఆ రోడ్ బ్లాక్‌లు, చెక్ పోస్టులు పెట్టి నిత్యం వేధిస్తుంటారు. పాలస్తీనీయుల ఇళ్లను, వ్యాపారాలను బుల్డోజర్లతో కూల్చేసి, వాటి స్థానంలో యూదు సెటిల్మెంట్స్ (కాలనీలు) నిర్మిస్తున్నది. దీనిని ప్రశ్నిస్తే కర్కశంగా అణచివేస్తుంది. 1948 తరువాత పాలస్తీనియన్ శరణార్థులను వారి ఇళ్లకు తిరిగి రాకుండా అడ్డుకుంటోంది. పాలస్తీనీయుల ముందు నెతన్యాహు మూడు ఎంపికలు ఉంచాడు. 1. గాజా వీడి బయటకు పొండి, 2. చావడానికైనా సిద్ధం కండి, 3. ఆక్రమణను ఎన్నడూ ప్రశ్నించకూడదు. ఇదీ నెతన్యాహు మార్కు దమనకాండ.
అర్థరహిత ఆరోపణలు..
గాజాపై నెతన్యాహు ఇలా ఆటవిక యుద్ధం సాగించడం 2005 నుంచి చూసినట్లైతే ఇది అయిదవది. పాలస్తీనా ప్రజల ఉనికి హక్కును కాలరాసే దిశగా నెతన్యాహు ప్రభుత్వం చర్యలు ఉన్నాయనేది స్పష్టం. గాజాపై సాగిస్తున్న క్రూరమైన యుద్ధ నేరాలను సమర్థించుకునేందుకు అక్టోబరు 7 దాడిని నెతన్యాహు సాకుగా చూపుతున్నారు. హమాస్ దాడిని నాజీ హిట్లర్ సాగించిన భయంకర సామూహిక మారణహోమంతో పోల్చడం అర్థరహితం. బలమైన యూదు ఆర్మీ, శక్తివంతమైన యూదు రాజ్యం లేకుంటే హిట్లర్ సాగించిన మారణహోమం లాంటిదే మరొకటి ముంచుకొచ్చే ప్రమాదముందని ఎలిమెంటరీ స్కూల్ దశ నుంచే పిల్లల మెదళ్లను కలుషితం చేస్తోంది. హమాస్ దాడిపై ఇజ్రాయిల్ అధ్యక్షుడి మాజీ మీడియా సలహాదారు, ప్రభుత్వ ప్రతినిధి ఐలాన్ లెవీ స్పందిస్తూ, హిట్లర్ యూదులపై సాగించిన మారణకాండతో అక్టోబరు 7నాటి ఘటనను పోల్చారు.
దాడి కాదు.. మెరుపు తిరుగుబాటు..
తరతరాలుగా పాలస్తీనా భూములను అక్రమించి, వారిని బానిసల కన్నా హీనంగా చూసే ఇజ్రాయిలీ దాష్టీకాలపై మెరుపు తిరుగుబాటే అక్టోబరు7 నాటి ఘటన. ఈ దాడిలో ఇజ్రాయిల్‌కు చెందిన 1300 మంది మరణించిన సంగతి తెలిసిందే. నాజీ హిట్లర్ యూదులపై ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, ఏకంగా 12 ఏళ్ల పాటు మారణకాండ సాగించాడు. మరీ ముఖ్యంగా 1941-45 మధ్య నాన్‌స్టాప్‌గా సాగిన ఊచకోతలో అత్యధికమందిని నాజీలు పొట్టనపెట్టుకున్నారు. మొత్తం మీద 6,00,000 మంది యూదులు హిట్లర్ అమానుషత్వానికి ఆనాడు బలయ్యారు. అటువంటి అత్యంత దారుణమైన ఘటనతో హమాస్ ప్రతిఘటన దాడిని పోల్చడమంటే చరిత్రను వక్రీకరించడమే. నాజీల చేతిలో నరకయాతన అనుభవించిన యూదులే ఇప్పుడు పాలస్తీనీయులపై అదే విధమైన ఊచకోతకు పాల్పడడం చారిత్రిక వైచిత్రి. యూదు దురహంకార ఇజ్రాయిల్ ఆర్మీ నుంచి అనేక విధాలైన నిర్బంధాన్ని, అణచివేతను ఎదుర్కొంటున్న సంస్థ హమాస్. ఇజ్రాయిల్ చర్యను సమర్థించే మరికొందరు సెప్టెంబరు11 దాడులతో హమాస్ దాడిని పోల్చే యత్నం చేస్తున్నారు. న్యూయార్క్‌లోని డబ్ల్యుటిసి టవర్స్‌పై ఒసామాబిన్ లాడెన్ జరిపిన దాడి తర్వాత అమెరికా ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియాపై దండెత్తి, వాటిని ఎలా నాశనం చేసిందో చూశాం.
సామ్రాజ్యవాదుల దన్నుతోనే..
‘ఉగ్రవాదంపై యుద్ధం’ అనే ఆకర్షణీయమైన నినాదం మాటున అమెరికా తన ప్రపంచాధిపత్యాన్ని నిలబెట్టుకోడానికి ప్రయత్నించింది. ఆ క్రమంలో ఇరాక్‌లో మూడు లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు లక్షల మందిని పొట్టన పెట్టుకోవడమేగాక, అంతులేని విధ్వంసాన్ని సృష్టించింది. నెతన్యాహు కూడా ఇప్పుడదే పని చేస్తున్నాడు. 1948లో ఇజ్రాయిల్ ఒక దేశంగా ఉనికిలోకి వచ్చినప్పటి నుంచే మొదలైన ఈ ఆక్రమణ, అణచివేతలు నెతన్యాహు హయాంలో పరాకాష్టకు చేరాయి. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఇజ్రాయిల్ ఏర్పాటుకు వీలుగా ఏడు లక్షల మంది పాలస్తీనీయులను బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. దీనినే ‘నక్బా (విపత్తు)’ అని పిలుస్తారు. ఈనాడు అమెరికా సామ్రాజ్యవాదం దన్నుతో నెతన్యాహు గాజాలోని 23 లక్షల మంది పాలస్తీనీయులను మాతృభూమి నుంచి గెంటివేసి, మరో నక్బాకు కారకుడయ్యాడు.పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ దాడులకు అమెరికా మరింత ఆజ్యం పోస్తోంది. ఇజ్రాయిల్‌కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం భారీ యుద్ధ విమాన వాహక నౌకలను, క్షిపణులను మధ్యదరా సముద్ర తీరంలో మోహరించింది. సిరియా, లెబనాన్, యెమెన్‌పై వైమానిక దాడులు చేస్తూ, ఈ యుద్ధాన్ని ప్రాంతీయ యుద్ధంగా మార్చాలని చూస్తోంది.
వెల్లువెత్తుతున్న సంఘీభావం
గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న దారుణ మారణకాండను ఆపాలని కోరుతూ.. కైరో, లండన్, వాషింగ్టన్, న్యూయార్క్, పారిస్‌లతో సహా ప్రపంచ వ్యాపితంగా పలు నగరాల్లో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. లండన్‌లో కనీవినీ ఎరుగని రీతిలో ఎనిమిది లక్షల మందితో భారీ ర్యాలీ జరిగింది. వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఎదుట మూడు లక్షల మందితో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రపంచ వ్యాపితంగా షట్‌డౌన్ పాటించాలని ప్రగతిశీల శక్తులు, మానవహక్కుల సంస్థలు, శాంతి ఉద్యమ కార్యకర్తలు ఇప్పటికే పిలుపునిచ్చారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ప్రజలు పాలస్తీనా వైపు ఉంటే, ఈ దేశాల్లోని మితవాద పాలకులు ఫాసిస్టు నెతన్యాహుకు వత్తాసు పలుకుతున్నాయి. సంఘీభావ ఉద్యమాలకు మద్దతుగా ఓడరేవు కార్మికులు, ఆయుధ ఫ్యాక్టరీల కార్మికులు తమదైన రీతిలో నిరసనలకు దిగుతున్నారు. ఇజ్రాయిల్‌కు ఆయుధాలను ఓడలో లోడ్ చేయడానికి అమెరికా, బ్రిటన్ తదితర దేశాల కార్మికులు తిరస్కరించారు. పాలస్తీనాపై ప్రయోగించే ఆయుధాలను ఇక్కడ తయారు చేయడానికి తాము అంగీకరించేది లేదంటూ లండన్‌లో కార్మికులు పనిముట్లు కింద పడేసి నిరసన తెలిపారు. ఇజ్రాయిల్ మారణ కాండను నిరసిస్తూ బ్రెజిల్, వెనిజులా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, టర్కీ తదితర దేశాలు ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. హమాస్ దాడి జరిగిన వెంటనే యూదు దురహంకార నెతన్యాహు ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల అధినేతలు స్వయంగా వెళ్లి కలిశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ వెళ్లకపోయినా, నిస్సిగ్గుగా నెతన్యాహుకు వత్తాసు పలికారు. గాజాలో అమాయక పౌరులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్ దాష్టీకాలను ఖండించడానికి మోడీకి మనస్కరించలేదు. గాజాపై దాడులను ఆపండంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అత్యధిక దేశాలు మద్దతు తెలిపాయి. జోర్డాన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి అనుకూలంగా 120 దేశాలు ఓటు చేయగా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రియా వంటి 14 దేశాలు వ్యతిరేకంగా ఓటు చేేశాయి. భారత్‌తో సహా 45 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానం హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పేర్కొనేందుకు తిరస్కరించడం గమనార్హం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసింది. దాని స్థానంలో అమెరికా, ఇజ్రాయిల్ అనుకూల విధానాన్ని అనుసరిస్తున్నది.
ఇజ్రాయిల్- పాలస్తీనా వివాద నేపథ్యం..
1917 బెల్‌ఫోర్డ్ డిక్లరేషన్ యూదులకు ఒక దేశం ఉండాలని మొట్టమొదట ప్రతిపాదించింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అంటే 1947 నవంబర్ 29న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పాలస్తీనా భూభాగాన్ని మూడు భాగాలుగా విభజించాలని ప్రతిపాదించింది. దీనికి 33 దేశాలు మద్దతు పలకగా, స్వతంత్ర భారతదేశం సహా 13 దేశాలు అభ్యంతరం తెలిపాయి. చైనా సహా 10 దేశాలు గైర్హాజరయ్యాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం లేకుండానే బ్రిటన్ తన వలసపాలన కింద ఉన్న పాలస్తీనా ప్రాంతంలో 30 శాతం భూ భాగంలో ఇజ్రాయిల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించింది. ఆ విధంగా ఉనికిలోకి వచ్చిన ఇజ్రాయిల్ 1967లో ఆరు రోజులపాటు సాగిన యుద్ధం తరువాత 70 శాతం పాలస్తీనా భూములను ఆక్రమించింది. గాజాను బహిరంగ జైలుగా మార్చింది. ఒక భూభాగం తరువాత మరో భూభాగం ఆక్రమించుకుంటూ నేడు 87 శాతం ప్రాంతాన్ని యూదు దురహంకార ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకుంది. ఈ యూదు రాజ్యం ఏర్పాటును మొట్టమొదట గుర్తిస్తునట్లు ప్రకటించింది అమెరికా. అయితే, భారత్ స్వాతంత్య్రోద్యమానికి ముందు నుంచీ పాలస్తీనాకు గట్టి మద్దతుదారుగా ఉంది. 1931లో మహాత్మగాంధీ హరిజన పత్రికలో రాసిన వ్యాసంలో ‘ఇంగ్లండ్ ఆంగ్లేయులకు, ఫ్రాన్స్ ఫ్రెంచి వారికి చెందినట్లే పాలస్తీనా అరబ్బులకు చెందినది’ అని స్పష్టంగా తన వైఖరిని ప్రకటించారు. 1990 వరకు భారత్ ఇదే వైఖరిని కొనసాగిస్తూ వచ్చింది. 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి, ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించింది. వాజ్‌పేయి ప్రభుత్వం దానిని మరిన్ని రంగాలకు విస్తరించింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత విదేశాంగ విధానాన్ని సామ్రాజ్యవాద అనుకూల విధానంగా మార్చేసింది. చమురు వనరులను చౌకగా కొల్లగొట్టాలని చూస్తున్న పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్‌ను పశ్చిమాసియాలో తమ పోలీస్ అవుట్‌పోస్టుగా పరిగణిస్తున్నాయి. తమ సైనిక బంటును బలపరచుకునేందుకు అవి ఏటా డబ్బు సమకూర్చుతూ వస్తున్నాయి. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానం అమలుకాకుండా తొక్కిపడుతున్నది ఈ సామ్రాజ్యవాద దేశాలే. అమెరికా మధ్యవర్తిత్వంలో 1993లో ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య కుదిరిన ఓస్లో ఒప్పందాన్ని ఈ దేశాలే నిర్వీర్యం చేశాయి. నాటి భూభాగంలో 13 శాతం మాత్రమే నేడు పాలస్తీనా నియంత్రణలో ఉంది. దీనిని కూడా కబళించాలని అమెరికా, ఇజ్రాయిల్ కుట్ర పన్నుతున్నాయి.
స్వతంత్రే పరిష్కారం..
ఐక్యరాజ్య సమితి తీర్మానంలో పేర్కొన్నట్టుగా 1967కి ముందున్న సరిహద్దులతో తూర్పు జెరూసలెం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పడడమొక్కటే ఈ సమస్యకు పరిష్కారం. ఈ ప్రాంతంలో శాంతి సైనిక చర్య ద్వారా సాధ్యం కాదు. రాజకీయ పరిష్కారమే ఏకైక మార్గం. ఇజ్రాయిల్ దౌర్జన్యంగా ఆక్రమించిన పాలస్తీనా భూ భాగాలన్నిటి నుంచి బేషరతుగా వెనక్కి వెళ్లాలి. గాజాపై దాడులను తక్షణమే ఆపాలి. పశ్చిమాసియాలో సామ్రాజ్యవాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు సంఘీభావం ఒక వజ్రాయుధంగా ఉపయోగపడుతుంది. ప్రపంచ వ్యాపితంగా ఉన్న కార్మికవర్గం, లౌకిక, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులు ఐక్యంగా ఉద్యమించడం ద్వారా ఈ సంఘీభావ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి.
రషీదా తాలిబ్
నెతన్యాహు నేతృత్వంలోని రేసిస్టు, ఫాసిస్టు ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శించిన పాలస్తీనా సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి రషీదా తాలిబ్‌ను ఆ దేశ పార్లమెంటు అభిశంసించింది. మిచిగాన్‌కు చెందిన డెమొక్రాటిక్ ప్రతినిధి తాలిబ్ అధ్యక్షుడు జో బైడెన్‌తో డెట్రాయిట్ విమానాశ్రయంలో ఎనిమిది నిమిషాలు ముఖాముఖి చర్చలు జరిపిన ఐదు రోజులకే ఈ అభిశంసన తీర్మానం తీసుకొచ్చారు. దీనిని ప్రతినిధుల సభ 234-188 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ తీర్మానంపై జరిగిన చర్చలో తాలిబ్ మాట్లాడుతూ, అభిశంసన ద్వారా తన నోరు నొక్కలేరని ఆమె అన్నారు. గాజాలో అమాయక పాలస్తీనా మహిళలు, పిల్లలను అమానుషంగా పొట్టన బెట్టుకున్న ఇజ్రాయిల్ వర్ణ వివక్ష, జాతి వివక్షాపూరిత విధానాలకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందంటూ ఆమె ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు. మానవ హక్కుల గురించి ప్రపంచానికి లెక్చర్లిచ్చే అమెరికా, తన గడ్డపై ఒక శాసనకర్త భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడాన్ని ఏమనాలి?
ఇజ్రాయిలీ కమ్యూనిస్టు ఎంపీలు అయిదా తామి సుల్లేమన్, అఫర్ కాసిఫ్‌లపై సస్పెన్షన్ వేటు
గాజాపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని వ్యతిరేకించినందుకు ఇజ్రాయిల్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. నైతిక విలువలు కలిగిన ఏ ఆర్మీ అయినా ఆసుపత్రులపైన, అమాయక పౌరులపైన బాంబు దాడులు చేయవు. కానీ, ఇజ్రాయిల్ అర్మీ అత్యంత క్రూరంగా గాజా సిటీలోని ఆసుపత్రులు, స్కూళ్లు, మసీదులు, అపార్టుమెంట్లపై దాడులు చేస్తోంది. దీనిని వ్యతిరేకించడమే మహా పాపం అన్నట్లుగా పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ అయిదా సులేమన్‌పై రెండు మాసాలు, మరో ఎంపి అఫర్ కాసిఫ్‌పై 45 రోజుల పాటు పార్లమెంటు నుంచి సస్పెండ్ చేసింది. నెతన్యాహు ప్రభుత్వం తన విధానాలను ఎవరు ప్రశ్నించినా, విమర్శించినా అత్యంత నిరంకుశంగా వారిని అణచివేస్తుంది. ఇజ్రాయిల్ యుద్ధానికి వ్యతిరేకంగా దేశంలో ఎలాంటి ర్యాలీలు జరపరాదంటూ నిషేధం విధించింది.
– కె. గడ్డెన్న9490099012