తొలగించిన చోటే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   బొగ్గుల దిబ్బ దళితుల ఇళ్లు తొలగించిన చోటే నిర్మించాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. శనివారం సిసిఎం ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ కార్యాలయం వద్ధ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసపి ప్రభుత్వం పట్టణాల్లో, నగరాల్లో ప్రభుత్వం భూముల్లో నివాసమున్న చోటే రెగ్యుల రైజ్‌ చెయ్యాలని జీవో నెంబర్‌ 60 ఇచ్చిందన్నారు. దీన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. దళితుల ఆత్మ గౌరవం కాపాడేందుకు సిపిఎం ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని అన్నారు. హాస్పటల్‌ ఏరియాలో రోడ్డు పక్కనున్న వారికి జెఎన్‌టియు వద్ద ఇళ్లు నిర్మించి ఇచ్చారని, వారు ఇళ్లల్లో దిగిన తరువాతే వారి ఇళ్లు తొలగించారని తెలిపాఉ. అదే పద్ధతి బొగ్గులదిబ్బ దళితులు విషయంలో ఎందుకు పాటించలేదని అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం అందజేశారు. కమిషనర్‌ స్పందిస్తూ కోర్టులో ఉన్న 18 ఇళ్లు తొలగించామని అన్నారు. పూర్తిగా ఇళ్లు ఇవ్వని వారికి ప్రత్యామ్నాయం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.రమణమ్మ, కుల వివక్ష నిర్మూలన పోరాట కమిటీ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్‌, బొగ్గుల దిబ్బబాధితులు అప్పల కొండమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️